Read more!

సమచిత్తత్వం అంటే ఏమిటి.. అదెలా సాధ్యమవుతుంది!

 

సమచిత్తత్వం అంటే ఏమిటి.. అదెలా సాధ్యమవుతుంది?

మనిషి జీవితంలో ఆధ్యాత్మికత అద్భుతం చేస్తుంది. ఆధ్యాత్మిక చింతన ద్వారా జీవితాన్ని తృప్తిగా ముగించినవాళ్ళు చాలామంది ఉన్నారు. మరీ ముఖ్యంగా మనిషి జీవితం ఒక సరైన దిశలో సాగడానికి భగవద్గీత అద్భుతంగా దోహదం చేస్తుంది. సమచిత్తత్వం ప్రతి మనిషికి అవసరమని గీత బోధిస్తుంది.  సర్వకాల సర్వావస్థల్లోనూ మనస్సు నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండడమే సమచిత్తత్వం. అప్పుడు బాహ్య వాతావరణంలో, పరిస్థితులలో మార్పు ఏ విధంగా ఉన్నా ఆ మార్పు మన మనస్సును ప్రభావితం చేయలేదు. ఈ సమచిత్తం గురించి గీతలో ఇలా చెప్పారు. 

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుభేషు విగత స్పృహః| వీతరాగ భయ క్రోధః స్థితధీర్ముని రుచ్యతే ॥

దుఃఖాలకు క్రుంగిపోక, సుఖాలకు పొంగిపోక ఆసక్తి, భయ క్రోధాదులు వీడడమే సమచిత్తత్వం. అటువంటి వాడి మనస్సు నిశ్చలంగా ఉంటుంది.

ప్రియాప్రియాలలోను, నిందాస్తుతులలోను, మానవమానాల్లోను, మిత్రుల మీద, శత్రువుల విషయంలో సమభావంతో ప్రవర్తించడమే సమచిత్తత్వం.

సుఖదుఃఖాలు, నిందాస్తుతులు, జయాపజయాలు ఇటువంటివి ప్రాపంచిక ద్వంద్వాలు. 'ఆగమాపాయినో నిత్యా' ఎప్పుడూ వచ్చిపోతుంటాయి. మామూలు మనిషి ఈ ద్వంద్వాలకు పొంగుతూ క్రుంగుతూ అస్థిర మనస్కుడై ఉంటాడు. యోగి మనస్సు విభిన్న పరిస్థితుల్లోను, అనుభవాలలోను చలించకుండా స్థిరంగా ఉంటుంది. పరిస్థితులు మారవు. మనమే మారాలి. 

మనస్సును అదుపులో పెట్టుకోవడం ద్వారానే సమచిత్తత్వం సాధ్యమవుతుంది. మనం బయటి యంత్రాలను అదుపులో పెట్టడం నేర్చుకున్నామే గానీ, మనకు అతి సమీపంలో ఉన్న అతి సున్నితమైన దేహ యంత్రం మొద్దుబారిపోతున్నా పట్టించుకోవడంలేదు. దీన్ని కొద్దిగానైనా అలవరచుకున్నప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మనచుట్టూ ఉన్న వారికి కూడా శాంతి కలుగుతుంది. అలాగే మనస్సును నియంత్రించడం ద్వారా అది శుద్ధమై భగవదున్ముఖ మవుతుంది. భగవదున్ముఖమైన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అదే అమ్మ జీవితం మనకు నేర్పే పాఠం.

ఈ విధంగా ప్రశాంతమైన, నిశ్చలమైన మనస్సున్న వ్యక్తి స్థిరంగా ఏ పనైనా చేస్తాడు. ఉద్రేకం, ఆర్భాటం వల్ల అశాంతే గానీ పని జరగదు. మామూలుగా మనకు కొంచెం పనిచేసే టప్పటికే అలసట కలుగుతుంది. పని ఇంకొంచెం ఎక్కువైతే ఒత్తిడి, ఘర్షణ, విసుగు కలిగి, పని నిబద్ధత తగ్గిపోతుంది. అయితే ఏ విధమైన మర్షణ లేకుండా మృదువుగా, సమర్థంగా కార్యాన్ని నిర్వహించడమే యోగం. అందుకే గీతలో యోగానికి ఇచ్చిన మరొక అద్భుత నిర్వచనం -“యోగః కర్మసు కౌశలం”. కర్మాచరణలో సమర్ధతే యోగం.

                                   ◆నిశ్శబ్ద.